ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తోంది. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.
కాగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో తొలిరోజు గురువారం పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మ దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటోకాల్ ఉన్నవారికి మినహా అంతరాలయ దర్శనాలను చాలావరకు నియంత్రించారు. ఈసారి వీఐపీల దర్శనాలను ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయంలోనే అనుమతించటం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి.