సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉందన్నారు. గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన తమ కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవని తెలిపారు. ‘‘అధికారంలోకి వచ్చి కేవలం వంద రోజులే అయింది.
ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాలపై ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదాని గురించే ఇపుడు మేం ఆలోచిస్తున్నాం. దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని ఎలా నిలబెట్టాలన్నదాని గురించే ఆలోచన తప్ప రోడ్డుపైకి రావాలని ఏనాడూ అనుకోలేదు. దశాబ్దంపైగా నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా, అవమానాలు చేసినా నేను పల్లెత్తు మాట మాట్లాడలేదు. కక్ష సాధింపులు ఉండవని గెలిచిన వెంటనే చెప్పాం. అయితే కలియుగ దైవానికి అపచారం జరిగితే ఎందుకు ఊరుకుంటాం’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అన్నీ రాజకీయాలేనా...అన్నీ ఓట్ల కోసమేనా అని ప్రశ్నించారు.