తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ సిట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఏ విధంగా న్యాయం చేయదు అనేది తమ భావనన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత ఆయన నియమించిన సిట్ ఏ విధంగా అయినా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగేదని విమర్శించారు. ఈరోజు సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయని.. సత్యం వెలుగులోకి వస్తుందన్నారు. తన ఆలయ ప్రతిష్ఠ భంగం కలిగించే వారిపై స్వామివారి చర్యలు ఉంటాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.