దసరా శరన్నవరాత్రులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఆలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి మంగళవాయిద్యాలు, అభిషేకాలు, ప్రాతఃకాలపూజ, గణపతిపూజ, అఖండ స్థాపన, సప్తశతి పారాయణం, మండపారాధన, పల్లకిసేవ, బాలపూజ, ప్రదోష కాలపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు దూపాటి పాలంక ప్రసాదశర్మ, విశ్వన్నారాయణశాస్త్రి, వేదపండితులు ఫణీంద్రకుమార్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంకురార్పణ పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకీలో ఆలయ ఉత్సవం నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎరిక్షన్‌బాబుకు అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మవారి పల్లకి సేవలో ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పాలకమండలి సభ్యులు, ఉభయ దాతలు పాల్గొన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు.