ఈ సారి ప్రభుత్వం మద్యం దుకాణాలకు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా టెండర్లు వేయవచ్చు. అతనికి ఎన్ని షాపులు లాటరీలో తగిలితే అన్ని కేటాయిస్తారు. గతంలో ఈ విధానం ఉండేదికాదు. లాటరీలో ఒక దుకాణం తగిలితే మిగిలిన షాపులకు అతను పేరు తొలగించేవారు. ఈ విధానం వల్ల అప్పట్లో వ్యాపారులు బినామీ పేర్లతో ఫారాలు కొనేవారు. ఈసారి కొత్త పాలసీ రావడంతో చాలా మంది తమ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లపైనే టెండర్లు వేసేందుకు మక్కువ చూపుతున్నారు. గతంలో ముందుగానే షాపులు వివరాలు తెలిసేవి, దీని వల్ల బాగా వ్యాపారం జరిగే షాపుకు పోటీ ఎక్కువుగా ఉండేది. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది.
దాని ప్రకారం పట్టణ, మండల పరిధిల్లో దుకాణాల సంఖ్య మాత్రమే చెబుతున్నారు. పట్టణంలో దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీలో దుకాణం తగిలితే ఆ పట్టణ పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే విధానం మండలానికి తీసుకొచ్చారు. ఈ నిబంధనతో పాటు పట్టణ పరిధిని 2కిలోమీటర్ల వరకు పెంచారు. రెండు కిలోమీటర్ల పట్టణానికి వెలుపుల పంచాయతీ పరిధులు ఉన్నా అది పట్టణ పరిధికే వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా పట్టణంలో షాపు దక్కించుకున్న పాటదారులు దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చు. టెండర్ వేసే వ్యక్తి ఖచ్చితంగా 21ఏళ్లు దాటి ఉంటాలి. 9న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.