మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ వేయడంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మండిపడ్డారు. శనివారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్ అంటే ఎందుకంత భయమని జగన్‌ను ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించామని.. కానీ సిట్ లేదు గిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సంస్కారమని నిలదీశారు.
విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కాగా... తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ఈరోజు (శనివారం) కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో దేశంలో 75 విమానాశ్రయాలు ఉండేవని.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 156కు పెంచారన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో స్థలాన్ని పరిశీలించి నూతన ఎయిర్ పోర్ట్‌లకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు పనిచేస్తానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.