ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (ఏపీఐఐసీ) మంతెన రామరాజు శనివారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంతెన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ‘‘నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్ బాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, కూటమి పెద్దలకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు’’ అని తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఏపీఐఐసీ ద్వారా కియా, హీరో ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. 2019-2024 మధ్య వచ్చిన ప్రభుత్వం ఏపీఐఐసీని నిరుపయోగం చేశారని మండిపడ్డారు. మరలా 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలందరికీ ఏపీఐఐసీని అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రులు అందరి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసీకి సంబంధించి ఒక లేఔట్ తయారుచేసి ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని.. అందులో భాగంగానే మంత్రులందరూ పనిచేస్తున్నారన్నారు. వంద రోజులు పూర్తయ్యేలోగానే చాలా పరిశ్రమలను పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్ళటం జరిగిందని మంతెన రామరాజు పేర్కొన్నారు.