అన్న క్యాంటీన్‌లకు నోడల్ ఆఫీసర్లగా మునిసిపల్ కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. క్యాంటీన్ లో అల్పాహారం, భోజనాలు చేసే వారి సంఖ్యను కచ్చితంగా గుర్తించేలా చూడాల్సిన బాధ్యత వీరికి అప్పగిం చింది. భోజనం, అల్పాహారాలను అందించే బాధ్యత అక్షయపాత్రది. కొన్ని చోట్ల భోజనాల సరఫరాకు, స్థానికంగా ఉండే డిమాండ్‌కు పొంతన ఉండడం లేదు. ప్రతీరోజు ఆహారం తీసుకున్న వారి సంఖ్య స్పష్టంగా ఉండాలి. టోకెన్ విధానాన్ని కచ్చితంగా అమలుచేయాలి.
జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర సాపురం పట్టణాల్లో తొమ్మిది క్యాంటీన్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ వందలాది మంది భోజనాలు చేస్తున్నారు. టోకెన్‌ల జారీలో నిర్వాహకులు ఇచ్చే సంఖ్యకు పొంతన ఉండడం లేదు. దీంతో వీటి పర్యవేక్షణ బాధ్యతను మునిసిపల్ కమిషనర్లకు అప్పగించింది. వీరు టోకన్ల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. దీని ఆధారంగానే బిల్లులు చెల్లిస్తారు.