ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఖాతా కూడా తెరవలేదు. 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 47, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కానీ 90 సీట్లకు గాను 89 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కచోటా విజయం దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ఈ ఫలితాలు (హర్యానా ఎన్నికలు) అతిపెద్ద గుణపాఠం... ఎప్పుడూ అతివిశ్వాసం ఉండరాదని కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూద్దామని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలను కూడా తేలికగా తీసుకోవద్దని సూచించారు. ప్రతి ఎన్నిక, ప్రతి సీటు కూడా ఎంతో క్లిష్టమైనదన్నారు.