ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 14న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ.. ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 23వ తేదీ ఒకేరోజు 13వేలకు పైగా గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. అయితే ఈ గ్రామసభల్లో అనేక పనులకు తీర్మానం చేశారు, తీర్మానించిన ఈ పనులను ప్రారంభించేందుకు.. పల్లె పండుగ పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది. అక్టోబర్ 14 నుంచి పల్లె పండుగ కార్యక్రమం మొదలు కానుండగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, డిపిఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఫీల్డ్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జిల్లా నీటి సరఫరా విభాగం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నామని వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందన్న పవన్ కళ్యాణ్.. పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్ట్ 23వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులు ప్రారంభించాలని సూచించారు,
గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నామన్న పవన్ కళ్యాణ్.. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారం, తీర్మానాల అమలు చేయాలన్నారు. దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలని సూచించారు. పల్లె పండుగలో భాగంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు,
ఆగస్ట్ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ గ్రామసభల్లో గ్రామాల్లో చేపట్లాల్సిన అభివృద్ధి పనులు, ఇతరత్రా కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు ఈ అభిప్రాయాలను క్రోడీకరించి అన్ని గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల్లో పేర్కొన్న పనులను చేపట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకువస్తోంది.