ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ, ఆరెస్సెస్ ట్రాప్లో పడ్డారని.. చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనే కుట్ర జరుగుతోందంటూ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని నాశనం చేసేందుకు బీజేపీ.. పవన్ కల్యాణ్‌ను పావులా వాడుకుంటోందని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వంపై వందరోజుల్లోనే అసంతృప్తి మొదలైందన్న శ్రీనివాసరావు.. నిరుద్యోగుల్లోనూ నిరాశ వ్యక్తమవుతోందని విమర్శలు చేశారు.
"పైన మాట్లాడుతున్న తీరు ఒకలా ఉంది. లోపల జరుగుతున్న తీరు మరోలా ఉంది. ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి, ఆందోళన మొదలైంది. ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతోంది. డీఎస్సీ అంటూ నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లారు. అక్టోబర్ అన్నారు, ఇప్పుడు జనవరంటున్నారు. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పక్కకు నెట్టేసి.. తిరుమల లడ్డూ తెరపైకి ప్రజల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఆరెస్సెస్, బీజేపీ ట్రాప్‍లో పడి వ్యవహరించడం రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుంది. "
"ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వకుండా బీజేపీ ఇప్పటికే ఏపీకి నష్టం చేసింది.ఇప్పుడు గద్దలాగా తన్నుకుపోవాలని చూస్తోంది. ఈ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంలో తెరవెనుక పాత్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్‌దే. రెండేళ్లలోపు తెలుగుదేశం పార్టీని దించేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఊడగొట్టి, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని వారి ప్లాన్. దానికోసమే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈ విద్వేష రాజకీయాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ కూడా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లాగా అశాంతితో రగిలిపోతుంది." అని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూ వివాదం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నేపథ్యంలో.. లెఫ్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఒకప్పడు జనసేన, వామపక్షాలు మిత్రపక్షాలుగా పనిచేశాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఆరెస్సెస్ ట్రాప్లో పడ్డారని.. వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ఇన్నిరోజులు నష్టం చేసిన బీజేపీ.. ఇప్పుడు ఈ రకంగా ఏపీకి నష్టం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఆధారంగా ఏపీలో పాగా వేయాలని బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తున్నాయని సీపీఎం పార్టీ ఆరోపించింది.