తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా టమాటా రేట్లు అయితే కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. టమాటా రేంజులో కాకపోయినా.. ఉల్లి కూడా కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. దీంతో కూరగాయలు కొనలేక.. సగటు జీవి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో సగటు జీవికి ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రాయితీపై ఉల్లి, టమాటాలు ప్రజలకు విక్రయించాలని నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుబజార్లలో సబ్సిడీ రేట్లకు ఉల్లి, టమాటాలను విక్రయించనున్నారు.
కూరగాయల ధరల పెరుగుదలపై వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. సగటు మధ్యతరగతి జీవికి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న మంత్రి.. ఉల్లి, టమాటాలను రాయితీపై అందించాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలోనూ రైతుబజార్లలో వెంటనే టమాటా, ఉల్లిపాయల విక్రయాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
వర్షాలు, వరదలు మాత్రమే కాకుండా పలు కారణాలతో టమాటా, ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. కిలో ఉల్లి రూ.55 నుంచి రూ.70 వరకూ పలుకుతుండగా.. టమాటా ఏకంగా కొన్నిచోట్ల రూ.90 నుంచి రూ.100 పలుకుతోంది. ఈ నేపథ్యంలో ధరలు అదుపులోకి వచ్చే వరకూ రాయితీపై ఉల్లి, టమాటాలను రైతుబజార్లలో విక్రయిచాలని మంత్రి అచ్చెన్నాయుడు.. ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసి, ఉమ్మడి జిల్లాలలోని అన్ని రైతుబజార్లలో అమ్మకాలు ప్రారంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మంత్రి ఆదేశాలతో రైతు బజార్లలో కిలో టమాటా రూ.50 లకే విక్రయించనున్నారు. అలాగే కిలో ఉల్లి కూడా రూ.40 నుంచి రూ.45 కే విక్రయించనున్నారు.
మరోవైపు తక్కువ ధరకు కూరగాయలు దొరుకుతాయని రైతుబజార్లకు వెళ్తున్న ప్రజలను మరో రకమైన సమస్య ఇబ్బంది పెడుతోంది. కొన్ని రైతు బజార్లలో మరో రకమైన దందా నడుస్తోంది. రైతు బజార్లలో విక్రయించేందుకు తెచ్చే కూరగాయల్ని కొన్ని చోట్ల బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో రైతు బజార్ల వద్ద కృత్తిమ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైతు బజార్లకు వచ్చే కూరగాయలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.