స్టడీ టూర్ కోసం రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లిన విజయవాడ లాయర్లు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన 70 మందికిపైగా లాయర్లు స్టడీ టూర్ కోసం రెండు బస్సుల్లో రాజస్థాన్ వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు మంగళవారం తెల్లవారుజామున జోధ్‌పూర్ వద్ద ఓ టోల్‌గేట్ సమీపంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న దుర్మరణం చెందారు. జ్యోత్స్న అమరావతి బాలోత్సవం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విజయవాడకు వరదలొచ్చిన సమయంలో.. జ్యోత్స్న ఇతరులతో కలిసి వరద బాధితులకు తనవంతు సాయం అందించారు. ఇటీవలే దసరా సాంస్కృతిక ఉత్సవాలను సైతం ఆమె ఉత్సాహంగా నిర్వహించారని సన్నిహితులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు కాగా.. వారిని సమీప హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అక్టోబర్ 10న వీరంతా విజయవాడ తిరిగి రావాల్సి ఉండగా.. రెండు రోజుల ముందు ప్రమాదానికి గురి కావడం, ఒకరు మరణించడం అందర్నీ కలచి వేసింది. రాజస్థాన్‌లో విజయవాడ న్యాయవాదులు ప్రమాదం బారిన పడటం, ఒకరు మరణించడం పట్ల.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితోపాటు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ నేత దేవినేని ఉమా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సతీమణిని కోల్పోయిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన నేతలు.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సుంకర జ్యోత్స్న మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. విద్యార్థినులు, మహిళలను చైతన్యపరిచేలా ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. యాక్సిడెంట్ ఎలా అయ్యిందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని, వారికి అవసరమైన సాయం అందంచాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.