ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. విజయదశమి శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. భక్తులు సైతం భిన్నరూపాల్లో అమ్మవారిని అలంకరిస్తున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ అమ్మవారిని చూసేందుకు భక్తులు కూడా భారీగా తరలివస్తున్నారు. ఏంటీ అమ్మవారి ప్రత్యేకత అంటే.. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడమే.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరో రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులను కటాక్షించారు. ఇందుకోసం ఆలయ సిబ్బంది కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరించారు. దీనికోసం 3 కోట్ల 33 లక్షల 33 వేల 333 రూపాయల విలువైన కరెన్సీ నోట్లను ఉపయోగించారు. రూ.50 మొదలుకుని రూ.500 వరకూ అన్ని నోట్లను ఇందుకు ఉపయోగించారు. అమ్మవారిని మాత్రమే కాకుండా ఆలయాన్ని కూడా ఆర్య వైశ్య సంఘం కమిటీ కరెన్సీ నోట్లతో ముస్తాబు చేసింది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కరెన్సీ నోట్ల అలంకరణ నడుమ ధగధగా మెరిపోతున్న అమ్మవారిని దర్శించుకున్నారు.
మరోవైపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సైతం గంగానమ్మ అమ్మవారికి ఆలయ నిర్వాహకులు కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులను దర్శనం ఇచ్చారు. ఈ అలంకరణ కోసం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని రూ.2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో ఆలయ కమిటీ సిబ్బంది అలంకరించారు. విగ్రహం చుట్టూ భారీగా నోట్ల కట్టలు, నాణేలు ఉంచారు. మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చిన గంగానమ్మ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.