కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. తాజాగా.. చేనేతలను ఆదుకొని వారి వృత్తికి ఆధునికత చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు కష్టమైన పని సులువుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. చేనేతలు సరికొత్త డిజైన్లు తయారు చేసేలా వారిని ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచేందుకు ససరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చిన్న తరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేరువ చేయాలని జౌళిశాఖ నిర్ణయం తీసుకుంది.
2024-25 ఏడాదికిగాను చిన్న తరహా క్లస్టర్ అభివృద్ధి పథకం కింద కొత్తగా రాష్ట్రంలో 10 చేనేత క్లస్టర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బాపట్ల, పల్నాడు,గుంటూరు, జిల్లాల పరిధిలో ఒక్కొటి, తిరుపతి జిల్లాలో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోనూ ఒక్కొక్కటి చొప్పున నూతనంగా 5 కస్టర్ల ఏర్పాటుకు త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. మరో మూడు నుంచి ఆరు నెలల్లోనే ఏపీకి 10 క్లస్టర్లు మంజూరు కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం 3.50 లక్షల మంది చేనేత, అనుబంధ రంగాల కార్మికులు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 32 క్లస్టర్లున్నాయి.100 నుంచి 200 మంది చేనేత కార్మికులను ప్రాతిపదికగా తీసుకుని ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నచోట క్లస్టర్ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో వారికి ఉపాధి పెరగనుంది. చేనేతలను ప్రోత్సహించేందుకు గాను ఒక్కో క్లస్టర్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులను మూడేళ్ల వ్యవధిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్ పరిధిలోని కార్మికులకు 90 శాతం రాయితీతో ఆధునాతన చేనేత యంత్రాలు అందిస్తారు. ఫ్రేమ్ మగ్గం, మోటరైజ్డ్ జకార్డు, 120/140 జకార్డు మిషన్, నూలు చుట్టే యంత్రాలు, అచ్చు సెట్టు వంటి ఆధునిక పరికరాలు అందిస్తారు.
ఆయా యంత్రాలు రూ.15 వేల నుంచి రూ.70 వేల వరకు విలువ ఉంటాయి. చేనేత కార్మికులు 10 శాతం డబ్బులు చెల్లిస్తే.. మిగితా 90 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రూ.70 వేల యంత్రానికి రూ.7 వేలు చెల్లిస్తే చాలు. ఇక 100 శాతం పూర్తి రాయితీతో వ్యక్తిగత వర్క్ షెడ్డును నిర్మించి చేనేత కార్మికులకు అందిస్తారు. నూతన డిజైన్లపై చేనేత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఓ డిజైనర్ సైతం అందుబాటులో ఉంటారు. చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు క్లస్టర్ డెవలప్ ఎగ్జిక్యూటివ్‌ను కూడా కేంద్రమే నియమిస్తుంది.