ముంబయిలో రతన్ టాటా భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్దకు విచ్చేసిన చంద్రబాబు... రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ మహోన్నత వ్యాపారవేత్తతో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఒక అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణించారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. ఆయన ఎల్లప్పుడూ దేశం గురించే మాట్లాడేవారని, తన చేతల ద్వారానూ ఆ విషయాన్ని నిరూపించుకున్నారని చంద్రబాబు వివరించారు. వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి వారు అరుదుగా కనిపిస్తుంటారని పేర్కొన్నారు. ఓవైపు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూనే, మరోవైపు తన జీవితాంతం సామాజిక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ప్రపంచ ముఖచిత్రంపై భారత్ కనిపించేలా చేశారని, ఓ పారిశ్రామికవేత్తగా ఆయనకు అమోఘమైన విజన్ ఉందని చంద్రబాబు తెలిపారు. 100 దేశాల్లో టాటా గ్రూపు విస్తరించిందంటే అందుకు రతన్ టాటా కార్యదీక్షే కారణమని అన్నారు. ఏ అంశంలో చూసినా ఏదో ఒక టాటా సంస్థ కనిపిస్తుందని, రతన్ టాటా గొప్పదనం గురించి వివరించడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకోకుండా, నైతిక బాధ్యతగా ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయడం రతన్ టాటా మంచి మనసును చాటుతుందని వివరించారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలని కోరితే, వెంటనే ఆ పని చేశారని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఆర్థికసాయం చేశారని తెలిపారు. రతన్ టాటా భావజాలం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. యావత్ పారిశ్రామిక రంగాన్ని ఒక వ్యక్తి ఎలా మార్చివేశాడన్న దానికి రతన్ టాటానే ఉదాహరణ అని కీర్తించారు. అటువంటి మహనీయుడైన రతన్ టాటా మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఘనతర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.