ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకుంది. ముఖ్యమంత్రి అతిశీని బలవంతంగా అధికారిక నివాసం నుంచి ఎల్జీ ఖాళీచేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. అటు, అతిశీ తనకు సంబంధించిన వస్తువులను తీసుకుని బయటకు వెళ్లిపోయారని, సీఎం అధికారిక నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఓ బీజేపీ నాయకుడికి ఆ నివాసాన్ని కేటాయించాలని ఎల్‌జీ చూస్తున్నారని ఆరోపించడం గమనార్హం. ‘దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి అధికారి నివాసం ఖాళీ చేయించడం ఇదే మొదటిసారి.. బీజేపీకి తొత్తు అయిన లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం అతిశీకి చెందిన సామాన్లు బలవంతగా బయట పడేశారు’ అని సీఎంవో ఓ ప్రకటన చేసింది.
అయితే, దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు ఇంత వరకూ స్పందించలేదు. కానీ, ఎల్జీ ఆఫీసులో వర్గాలు మాత్రం దీనిని తోసిపుచ్చాయి. ‘అధికారిక నివాసం కేటాయించక ముందే అతిశీ తన వస్తువులను తీసుకొచ్చారు. వాటిని స్వయంగా ఆమె మళ్లీ పట్టుకెళ్లారుఈ భవనం అతిశీకి కేటాయించలేదు. ఆమెకు మథుర రోడ్డులోని 17 ఏబీను గతేడాది కేటాయించారు.. రెండు నివాసాలను ఎలా కేటాయిస్తారు’ ’ అని అన్నాయి.
ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరమైందని, అందుకే సీఎం అధికార నివాసంపై తప్పుడు వాదనలు చేస్తోందని ఆప్ మండిపడింది. ప్రజల మద్దతు పొందలేక ఆ పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖాళీచేసిన ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి అతిశీ రెండు రోజుల కిందటే అడుగుపెట్టారు. తాజాగా, పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌కు చెందిన బృందాలు.. ముఖ్యమంత్రికి సంబంధించిన సామగ్రిని రిక్షాలు, ట్రక్కుల్లో తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎల్‌జీపై సీఎం కార్యాలయ ఆరోపణలు చర్చనీయాశంగా మారాయి. ఇక, ఢిల్లీలో గత కొన్నాళ్లుగా అధికార ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అనేక అంశాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ.. ఎల్జీను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.