రేపల్లె నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోకి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ కార్యకర్తలకు వైయస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎలా పాలన చేస్తుందో మీ అందరికీ తెలుస్తోంది. నాలుగు నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటకు వస్తుంది.
చీకటి తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది. 2019 నుంచి 2024 వరకు ప్రతి ఇంటికీ మనం మంచి చేశాం. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ బ్రతికే ఉంది. అందుకే ప్రతి ఇంటికీ మనం గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పాలన చేస్తూ.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు పెద్ద డాక్యుమెంట్ తయారు చేసి, ఆ ఎన్నికలవగానే చెత్తబుట్టలో వేసే సంప్రదాయం. కానీ మొట్టమొదటిసారిగా మ్యానిఫెస్టో అన్నదానికి అర్ధం తీసుకొచ్చిన పాలన మాత్రం కేవలం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మ్యానిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్ కూడా విడుదల చేశాం. ఆ సంక్షేమ క్యాలండర్‌లో ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందుగానే చెప్పి.. ఆ ప్రకారం ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. గతంలో రాష్ట్రంలోనే కాదు.. బహుశా దేశంలోనే ఈ తరహాలో క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు. మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి. కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం యూటర్న్. ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ తిరోగమనమే కనిపిస్తో్తంది. ప్రతి చోటా వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. ‘వైయస్ జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ పోయింది. బిర్యానీ పోయింది’ అనే చర్చ జరుగుతోంది. పథకాల అమలు లేకపోగా, వ్యవస్థలన్నీ పతనం అవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. బిల్లులు చెల్లించడం లేదు. నెట్‌వర్క్ ఆస్పత్రుల బిల్లులు దాదాపు రూ.2300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని పేషెంట్ ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టగా, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉంది. అన్నీ వెనుకడుగే. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడం లేదు అని అన్నారు.