సనాతన ధర్మంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులో ఫిర్యాదు నమోదైంది. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్.. ఇతర మతాల పేర్లను తీసుకువచ్చి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారని లాయర్ వాంజినాథన్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దానిపై వివరణ ఇచ్చేందుకు తాజాగా హాజరైన వాంజినాథన్.. పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు.
ఇక హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై తరచూ మాట్లాడే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా అంటూ వాంజినాథన్ ప్రశ్నించారు. ఈనెల 4వ తేదీన మధురై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌పై వాంజినాథన్ ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తులో భాగంగా వాంజినాథన్‌కు సైబర్ క్రైం పోలీసులు సమన్లు పంపించగా.. బుధవారం హాజరై తన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు, న్యూస్, జనసేనా పార్టీ యూట్యూబ్ లింక్ సహా పలు ఆధారాలను సమర్పించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వాంజినాథన్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ బెదిరించే విధంగా మాట్లాడారని ఆరోపించారు. అంతేకాకుండా తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఎలాంటి సంబంధంలేని ముస్లింలు, క్రైస్తవుల గురించి ప్రస్తావించి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు సృష్టించేలా.. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు వాంజినాథన్ తెలిపారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయకపోతే కోర్టుని ఆశ్రయిస్తానని.. అవసరమైతే ఆందోళన కూడా చేపడతానని వాంజినాథన్ తెలిపారు. తమిళనాడులోని డీఎంకే, కాంగ్రెస్, వీసీకే వంటి పార్టీలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించాలని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఎప్పుడూ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని.. అది సనాతన ధర్మమా అని ప్రశ్నించిన వాంజినాథన్.. దాన్ని గవర్నర్ ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే సనాతన ధర్మంపై రెండు వైపులా తీవ్ర వివాదం నెలకొన్న వేళ తాజా వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.