జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి ఆ ఊరిలో పాఠశాల కోసం ఎకరం ఆట స్థలం కొనుగోలు చేసి.. ఆ స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదన్న విషయాన్ని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని నాడు ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలం పత్రాలను ఆ గ్రామ పెద్దలకు అధికారికంగా అంద చేశారు.
మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సమయంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఆ మాట ప్రకారం నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చానని’’ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.