ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూలానక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) కావడంతో రాష్ట్ర నలుమూలల భారీగా తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని క్యూలనూ ఉచితంగా వదిలేశారు. సామాన్య భక్తులతోపాటు, వీఐపీల తాకిడి ఎక్కువవ్వడంతో కొండ కిటకిటలాడింది. అమ్మవారు బుధవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గగుడి అధికారుల అంచనా. సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్ దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం నాడు ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా భక్తులు దుర్గమ్మను సరస్వతీ అలంకారంలో దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక, పోలీసు, రెవెన్యూ, దేవదాయశాఖల మధ్య సమన్వయం కారణంగా సామాన్య భక్తులు సైతం తమకు అసౌకర్యం కలిగిందని ఎక్కడా ఫిర్యాదులు రాకపోవడం విశేషం. మూలానక్షత్రంనాడు అన్ని టిక్కెట్ దర్శనాలను ఉచితం చేశారు. లక్షల్లో అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించటంలో.. క్యూలైన్ల క్రమబద్ధీకరణలో అన్ని శాఖలు విజయం సాధించాయి.