ఎప్పుడూ హింసాత్మక ఘటనలు, ఉగ్రవాద దాడులు, దుండగుల కాల్పులతో మారుమోగే దాయాది దేశం పాకిస్తాన్‌లో తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. బొగ్గు గనిలోకి తుపాకీతో ప్రవేశించిన ఓ ఆగంతకుడు.. కనిపించినవారిని కనిపించినట్లు కాల్చి చంపాడు. ఆ కాల్పుల్లో బొగ్గు గనిలో పనిచేసే 20 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఇక చనిపోయిన వారిలో, గాయపడిన వారిలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెగ సంచలనంగా మారింది.
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలో ఉన్న ఓ బొగ్గు గనిలో పనిచేసే ఉద్యోగుల క్వార్టర్స్‌లోకి ఓ సాయుధుడు ప్రవేశించాడు. బొగ్గు గనిలో ఉన్న ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో అక్కడ ఉన్న అమాయక ఉద్యోగులు 20 మంది మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించినవారిలో ఎక్కువమంది బలూచిస్థాన్‌లోని పష్తున్ ప్రాంతానికి చెందినవారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్గనిస్థాన్‌కు చెందిన పౌరులు ఉన్నట్లు పోలీసులు తెలిసింది.
ఇక ఇటీవలె పాకిస్తాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం అయిన కరాచీ ఎయిర్‌పోర్ట్ ముందు ఇటీవల ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ పేలుడు ధాటికి కరాచీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైనా పౌరులే లక్ష్యంగా జరిపిన ఈ పేలుడులో ముగ్గురు విదేశీ పౌరులు దుర్మరణం పాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో మరో 20 మంది స్థానికులు గాయపడ్డారు. అది ఐఈడీ పేలుడు అని సింధ్ హోం శాఖ మంత్రి జియావుల్ హసన్ లాంజర్ వెల్లడించారు.
ఇక వచ్చే వారం ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న వేళ.. తాజాగా జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ సమావేశానికి భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ హాజరు కానున్నారు.