సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల వరదలు పోటెత్తుతూ ఉంటాయి. ఒక్కోసారి వర్షాకాలం కాకపోయినా.. ఆకస్మిక వర్షాలు, వరదలు సంభవిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఎడారిలో వరదలు రావడం చూశామా. ఎడారిలో వరదలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. ప్రస్తుతం సహారా ఎడారిలో వరదలు పోటెత్తుతున్నాయి. నీటి జాడ లేని ఎడారిలో.. ఒయాసిస్‌ల కోసం కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూనే ఉండాలి. అయినా నీరు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ఈ భూమిపైనే అతి పెద్ద ఎడారి అయిన సహారాలో వరదలు రావడం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వరదలకు ప్రధాన కారణం.. ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలే.
ఈ భారీ వర్షాలకు ప్రస్తుతం సహారా ఎడారిలోని లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఇసుక దిబ్బల మీద వరద ప్రవాహం పొంగుతోంది. అయితే ఇలా ఆకస్మికంగా సహారా ఎడారిలో వరదలు సంభవించడానికి గల కారణాలను సైంటిస్ట్‌లు పరిశోధనలు చేస్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరగడంలో తలెత్తిన మార్పులే సహారా ఎడారిలో ప్రస్తుతం వరదలకు కారణమని భావిస్తున్నారు. ఈ సహారా ఎడారిలో గత 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న ప్రసిద్ధ ఇరికీ సరస్సులోకి ప్రస్తుత వరదలతో నీరు చేరినట్లు నాసా విడుదల చేసిన శాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తోంది.
ఇక సహారా ఎడారిలో కురిసిన వర్షాలకు ఖర్జూర చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి గుంటలు ఏర్పడ్డాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా.. తీవ్ర కరవు ఏర్పడిన ప్రాంతాల్లోనూ వరదనీరు వచ్చి చేరింది. ప్రపంచంలోని అత్యంత శుష్క ప్రదేశాల్లో సహారా ఎడారి ఒకటి కాగా.. ఎండాకాలం చివర్లో అరుదుగా వర్షం పడుతుంది. ఈ సహారా ఎడారిలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబరు నెలలో 2 రోజులపాటు కురిసిన వర్షం ఏడాది సగటును 250 మిల్లీమీటర్ల కన్నా తక్కువను దాటినట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. టాగౌనిట్ వంటి ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
దాదాపు 30 ఏళ్ల తర్వాత అత్యంత తక్కువ వ్యవధిలో భారీ వర్షం పడినట్లు మొరాకో వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఇక ఈ ఆకస్మిక వర్షాలను అదనపు ఉష్ణమండల తుపాన్లుగా పిలుస్తూ ఉంటారు. వీటి వల్ల గాలి ఎక్కువ తేమను ఉంచుకోవడం వల్ల మరింత ఆవిరై గురై భవిష్యత్తులో మరిన్ని తుపాన్లకు కారణం అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మొరాకోలో గత 6 ఏళ్లు వరుసగా ఏర్పడిన కరవుతో స్థానిక రైతులు.. తమ పంట పొలాల్లో ఎలాంటి సాగు లేకుండా బీడు భూముల కింద వదిలేశారు. అయితే ప్రస్తుతం కురిసిన వర్షాలతో అక్కడి రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.