శ్రీసత్యసాయి జిల్లాలో శనివారం దారుణం జరిగింది. చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. కత్తులతో బెదిరించి అత్తాకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం చిలమత్తూరు మండలానికి వలస వచ్చింది. ఈ కుటుంబంలో మొత్తం నలుగురు ఉంటారు. వీరంతా స్థానికంగా ఉండే ఓ నిర్మాణంలో పనిచేస్తున్నారు. వాచ్‌మెన్‍తో పాటు ఇతరత్రా పనులు చూసుకుంటూ అక్కడే ఉండేవారు. అయితే శనివారం తెల్లవారుజామున వీరు ఉంటున్న నిర్మాణం వద్దకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. రెండు బైక్‌ల మీద వచ్చిన నలుగురు దుండుగులు.. కత్తులతో అక్కడున్న అత్తాకోడలిని బెదిరించారు. అడ్డొచ్చిన తండ్రీకొడుకులను సైతం బెదిరించి.. అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
అత్యాచారం జరిగిన విషయమై బాధితులు చిలమత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఫిర్యాదు అందిన వెంటనే సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ బాధితులకు హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. కారకులను త్వరగా గుర్తించాలని.. కఠినంగా శిక్షించాలని అన్నారు. పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు.
మరోవైపు సత్యసాయి జిల్లా అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరైనా ఉపేక్షించవద్దనీ.. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబాన్ని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడటం క్షమించారని నేరమని మంత్రి సవిత ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సైతం ఈ ఘటనపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి.. ఘటనపై సీరియస్ అయ్యారు. దుండుగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.