తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున స్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అభిషేకం తర్వాత వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ సందర్భంగా ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానంలో భాగంగా శ్రీవారి సుదర్శనచక్రానికి పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు. ఇక చక్రస్నానం కోసం టీటీడీ కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. స్నానం తర్వాత దుస్తులు మార్చుకునేందుకు వీలుగా అదనపు టెంట్‌లను ఏర్పాటు చేసింది. అలాగే భక్తులకు వాటర్ బాటిల్స్, వేడి బాదం పాలను కూడా అందించారు. మొత్తం 300 మంది శ్రీవారి సేవకులు భక్తులకు తాగునీరు, బాదం పాలు, పుష్కరిణి పర్యవేక్షణ సేవలందించారు.