దక్షిణ కోస్తా, తమిళనాడుకు తుఫాన్ గండం పొంచి ఉంది. తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో ఈ నెల 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, తర్వాత బలపడి 14న వాయుగుండంగా మారుతుందని, 15న తుఫాన్‌గా మారి తమిళనాడులో తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు అంచనా వేశాయి. అయితే ఈనెల 13న అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది క్రమేపీ బలపడి 17వ తేదీ నాటికి వాయుగుండంగా మారి తమిళనాడులో తీరం దాటుతుందని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. మరో మోడల్ ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఈనెల 16కల్లా ఏపీలోని దక్షిణ కోస్తా తీరం దిశగా వస్తుందని, తర్వాత దక్షిణ భారతం మీదుగా పయనించి ఈనెల 18 నుంచి 19వ తేదీ మధ్యన అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ తిరిగి బలపడుతుందని విశ్లేషించారు.
అయితే బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడిన తర్వాత సముద్రం నుంచి తేమగాలులు బలంగా వీచే అవకాశం ఉండడంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈనెల 14 నుంచి వర్షాలు పెరుగుతాయి. కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. ఈనెల 17 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలావుండగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.