తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి మహారథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శాస్త్రోక్తంగా కైంకర్యాలు అందుకున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని మహాన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధుల్లో విహరింపజేశారు. భక్తులు అడుగుడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణలతో ఆలయ మాడవీధులు మార్మోగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మహారథం ఊరేగింపు ఎలాంటి ఆటంకాలూ లేకుండా రెండుగంటల్లో ముగిసింది.
రథానికి కట్టిన తాళ్లను పట్టుకుని భక్తులు గోవిందనామస్మరణలతో ముందుకు లాగారు. రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనమైన అశ్వవాహన సేవ కూడా వేడుకగా జరిగింది. శ్రీవారు కల్కి అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యత కలిగిన చక్రస్నాన ఘట్టం మంగళవారం ఉదయం పుష్కరిణిలో జరుగనుంది. రాత్రి ధ్వజావరోహణంలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.