పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం బురదలో కూరుకుపోయిన కారులో 538 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ డి.దీనబందు తెలిపారు. అనంతరం కారును పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు ఆయన చెప్పారు. సీఐ కఽథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మన్యం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్న కారు శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో చింతలవీధి జంక్షన్ సమీపంలో నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ, సిబ్బంది వెళ్లారు. బురదలో కూరుకుపోయిన కారును బయటకు తీసి మెకానిక్‌ల సాయంతో మధ్యవర్తుల సమక్షంలో కారు డోర్‌లను తెరిచి పరిశీలించారు. కారులో 538 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కారును పోలీసు స్టేసన్‌కు తరలించామని సీఐ దీనబందు తెలిపారు.
గంజాయి విలువ సుమారు రూ. 27 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మన్యం నుంచి మైదాన ప్రాంతానికి కారులో గంజాయిని తరలించే స్మగ్లర్లు మార్గం మరచిపోవడంతో చిక్కినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో అరకు ప్రధాన రహదారి నుంచి శరవేగంగా వచ్చిన కారు అడారిమెట్ట జంక్షన్ నుంచి ఎడమ చేతివైపు రూట్‌లో వెళ్లాల్సి ఉండగా.. మరి కాస్త ముందుకు వచ్చి కుడిచేతి వైపు గల పెదబయలు రహదారిలోకి వెళ్లారు. వెళ్లాల్సిన రూట్ కాదని వారి వెనుకనే ఉన్న మరో కారులో వ్యక్తులు చెప్పడంతో వాహనాన్ని శరవేగంగా వెనక్కి తిప్పే ప్రయత్నంలో బురదలో కూరుకుపోయింది. దీంతో వాహనాన్ని విడిచి కారులో ఉన్న నలుగురు వ్యక్తులు దిగి అక్కడ నుంచి వేరే కారులో పరారయ్యారు. వాహనం సమాచారాన్ని స్థానికులు ఉదయం 8 గంటల సమయంలో పోలీసులకు ఇవ్వడంతో వారు వచ్చి గంజాయి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనాలు వచ్చే వేగం.. మలుపులో వెళ్లే తీరు చింతలవీధి జంక్షన్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా గంజాయి స్మగ్లర్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.