ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని పలువురు కీలక నేతలు వీడి వెళ్లిపోయారు. తాజాగా మరో నేత వైసీపీని వీడనున్నట్లు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు రాపాక వరప్రసాద రావు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనన్న రాపాక వరప్రసాద రావు.. ఏ పార్టీలోకి వెళ్లాలనేదీ ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో దీనిపై తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు.
మరోవైపు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాపాక వరప్రసాద రావు.. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే ఆయనొక్కరే. అయితే కొద్దిరోజుల్లోనే రాపాక జనసేన పార్టీకి దూరమయ్యారు. వైసీపీలో చేరిపోయారు. వైసీపీ తరుఫన గడప గడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల సమయం నాటికి పరిస్థితి మారిపోయింది. రాజోలు వైసీపీ టికెట్ తనకే వస్తుందని అనుకున్న రాపాకకు చేదు అనుభవమే ఎదురైంది. 2019 ఎన్నికల్లో రాపాక వరప్రసాద రావు చేతిలో ఓడిపోయిన టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు.. 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.
ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా గొల్లపల్లి సూర్యారావుకే రాజోలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక రాపాక వరప్రసాద రావును అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయమని ఆదేశించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. రాజోలు నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీచేసిన రాపాక ఇద్దరూ ఓటమిపాలయ్యారు. అయితే అప్పటి నుంచి వైసీపీ అధిష్ఠానం తీరుపై రాపాక వరప్రసాద రావు అసంతృప్తితో ఉన్నారు. జనసేన నుంచి వచ్చినప్పటికీ.. వైఎస్ జగన్ చెప్పిన అన్ని పనులను చేసినట్లు రాపాక వరప్రసాద రావు చెప్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేల కంటే తానే ఎక్కువ పాల్గొనానన్న రాపాక.. అయినప్పటికీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్నారు.
వైసీపీలోకి ఎన్నికల సమయంలో వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు టికెట్ ఇచ్చారన్న రాపాక వరప్రసాద రావు.. ఇష్టం లేకపోయినా కూడా అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసినట్లు చెప్పారు. ఓడిపోతానని తెలిసి కూడా అయిష్టంగానే పోటీచేసినట్లు రాపాక చెప్పారు. వైసీపీలో ఇక కొనసాగలేనన్న రాపాక వరప్రసాద రావు.. ఏ పార్టీలోకి వెళ్లాలనేదీ ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. మరోవైపు ఆదివారం ఉదయమే జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నిర్వహించిన సమావేశంలో రాపాక పాల్గొన్నారు. దీంతో రాజోలు రాజకీయాల్లో ఇది చర్చనీయాంశమైంది.