పురోహితులంటే పంచె కట్టుకుని.. నుదిటిన బొట్టు పెట్టుకుని ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. అయితే వేద మంత్రాల పఠనం, పూజలే కాదు యుద్ధ విద్యలోనూ ప్రావిణ్యం ఉందని నిరూపించుకున్నారో పురోహితుడు. ఆయన దసరా రోజు పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ చేసి కత్తి విన్యాసంతో అదరగొట్టారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో విజయ దశమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ పోలీసు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వేడుకల్లో పాల్గొన్నారు.. పండుగ రోజు పోలీస్ స్టేషన్‌లో సీఐ వీరబాబు సమక్షంలో ఆయుధ పూజ జరిగింది. శాస్త్రోక్తంగా ఆయుధ పూజ చేసిన వేద పురోహితుడు ఉపద్రష్ఠ విజయాదిత్య కత్తి విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కత్తుల్ని తిప్పుతూ అదరగొట్టారు. పురోహితులంతా వేద మంత్ర పఠనం మాత్రమే కాదు.. కొందరు యుద్ధ విద్యలోనూ ఆరితేరి ఉంటారని నిరూపించారు.
అన్నవరం సత్యదేవుని ఆలయం దగ్గర పండుగలు, ఇతర పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అధికారులు, సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇకపై రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ద్వారా కూడా అధికారులు రద్దీ, ఇతర అంశాలను గమనించొచ్చు. ఈ ఆలయంలోని దాదాపు 250 సీసీ కెమెరాలను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేశారు.. పండుగల సమయంలో ఉత్సవాలు, ఇతర రద్దీ వేళల్లో సచివాలయం నుంచి పర్యవేక్షణ ఉంటటుంది. అన్నవరంతో పాటుగా అంతర్వేది, వాడపల్లి, పిఠాపురం, సామర్లకోట ఆలయాల్లో సీసీ కెమెరాలు ఆర్టీజీఎస్‌తో అనుసంధానం కానున్నాయి.
2017లో అన్నవరం ఆలయంలోని అన్ని విభాగాల దగ్గర ఫిర్యాదు పుస్తకాలను ఏర్పాటుచేశారు. ఆ పుస్తకాల్లో ఫిర్యాుదల్ని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అయితే 2020 తర్వాతి నుంచి గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ అక్కడ సలహా బాక్సులు ఏర్పాటు చేయనుంది. ఈ బాక్సులపై ఈవో ఫోన్‌నంబరు, మెయిల్ అడ్రస్ ఇతర వివరాలు ఉంటాయి. రాష్ట్రస్థాయిలోనూ ప్రత్యేకంగా వాట్సాప్ నంబరును దేవాదాయశాఖ త్వరలోనే తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.