ప్రకాశం జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో బదిలీల వ్యవహారం కలకలం రేపింది. సచివాలయ కార్యదర్శుల బదిలీల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో.. ఉన్నతాధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఓ అధికారిపై వేటు వేసిన అధికారులు.. సీరియస్‌గా స్పందించారు. గ్రామ సచివాలయ గ్రేడ్-5, గ్రేడ్-6 కార్యదర్శుల ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాల జరిగాయనే ఆరోపణలతో.. డీపీవో కార్యాలయం గత ఏవో ఎన్.శివప్రసాద్‌పై సస్పెన్షన్ పడింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ఈ మేరకు కలెక్టరేట్‌కు ఉత్తర్వులు పంపించారు.
అలాగే బదిలీల వ్యవహారంలో ఇప్పటికే డీపీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఎంవీ.కిషోర్, డిజిటల్ అసిస్టెంట్ పి.సాయి కోటేశ్వరరావును సస్పెండ్ చేశారు అధికారులు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులు.. వరుసగా బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏసీబీ చట్టం ప్రకారం ముగ్గురు ఉద్యోగులపైనా క్రిమినల్ చర్యల నిమిత్తం డీపీవో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు స్థానిక జిల్లా పంచాయతీ కార్యాలయం గోడపై ‘ఇది ప్రభుత్వ కార్యాలయం..పనిచేయడం మా విధి, పని చేయించుకోవడం మీ హక్కు. డబ్బుతో ప్రలోభ పెట్టకండి’ అంటూ గోడకు పోస్టర్ అంటించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలా డబ్బులు (లంచం) ఇవ్వొద్దని రాసుకొచ్చారు.
అలాగే ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఏవో శివప్రసాద్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావును జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణ అధికారిగా నియమించారు. విచారణ అనంతరం ఇచ్చిన నివేదికను పరిశీలించి.. ఆ నివేదికను పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు పంపించారు. ఆ వెంటనే డైరెక్టర్ గతంలో ఏవోగా పనిచేసిన శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి కార్యాలయంలో లంచాలు ఇవ్వవద్దంటూ బోర్డు పెట్టి మరీ విజ్ఞప్తి చేయడం ఉద్యోగ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వ కార్యాలయంలో ఇలా పోస్టర్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాల వ్యవహారం, ఈ పోస్టర్ గురించి చర్చ జరుగుతోంది.