ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో ఎన్నికల వేళ కలకలం... మాజీ మంత్రి, ఎన్సీపీ నేత దారుణ హత్య

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:54 PM

త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార మహాయుతి కూటమికి చెందిన మాజీ మంత్రి దారుణ హత్యకు గురయ్యారు.ఎన్సీపీ నేత (అజిత్ పవార్ వర్గం) బాబా సిద్దిఖీని ముంబయిలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జిషాన్ ఆఫీసుకు సమీపంలోనే శనివారం రాత్రి ఆయనపై దుండుగులు కాల్పులు జరిపారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆయనపై కాల్పులు జరిపారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఆరు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లినట్టు తెలిపాయి. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఆయన సన్నిహితుడి ఒకరు గాయపడినట్టు సమాచారం. దసరా పండుగతో పాటు ఎన్నికల జరగనున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగుతోంది. మరోవైపు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. పోలీసులు, లీలావతి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు.


‘‘ఈ ఘటన చాలా దురదృష్టకరం.. ఆయన (సిద్ధిఖీ) మృతిచెందినట్టు నివేదికలు అందుతున్నాయి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.. వీరిలో ఒకరు ఉత్తర్ ప్రదేశ్, ఇంకొకరు హర్యానాగా గుర్తించాం.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.. శాంతిభద్రతలను ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాను.. ముంబయిలో గ్యాంగ్‌వార్ తరహా వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు’ అని సీఎం షిండే స్పష్టం చేశారు.


మరోవైపు, డిప్యూటీ సీఎం, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. తన వర్గానికి చెందిన నేత హత్యపై అజిత్ పవార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఓ మంచి సహచరుడు, స్నేహితుడ్ని కోల్పోయానని ట్వీట్ చేశారు. బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిఖీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌తో ఉన్న 48 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో బహిష్కరించింది.


తన ప్రాణాలకు ముప్పు ఉందని సిద్దిఖీ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి బ్రిజ్‌మోహ్ శ్రీవాస్తవ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలిసారి బాంద్రా వె్స్ట్ నుంచి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సిద్ధిఖీ.. మళ్లీ 2004లో అదే స్థానం నుంచి గెలిచి.. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆహార పౌర సరఫరాలు, , కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు.. విలాసవంతమైన పార్టీలను నిర్వహించి వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య సాగిన కోల్డ్‌వార్‌కు 2013లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు ద్వారా సమసిపోయేలా చేశారు. సిద్దిఖీపై కాల్పుల జరిగిన వార్త తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com