జామ్‌నగర్ రాజకుటుంబం తమ తదుపరి వారసుడిగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ఎంపికచేసింది. ఈ మేరకు ప్రస్తుత జాం సాహెబ్ (మహారాజు) శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్ సింహ్‌జీ జడేజా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అజయ్ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని ఆయన పేర్కొన్నారు.
‘పాండవులు 14 సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాత జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అనంతరం విజయం సాధించిన రోజు దసరా. కాబట్టి ఈ రోజు అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాం.. ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరం అని నమ్ముతున్నాను.. థాంక్యూ అజయ్’ అని శత్రుసల్యసింహ్‌జీ అన్నారు. ఒకప్పటి నవానగర్ సంస్థానాన్నే ప్రస్తుతం జామ్‌నగర్‌గా పిలుస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో రాచరిక వ్యవస్థను రద్దుచేసి సంస్థాలను ఇండియన్ యూనియన్‌లో విలీనమైపప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన అజయ్ జడేజా క్రికెట్‌పై ఇష్టంతో మైదానంలో అడుగుపెట్టి ఆటలోతనదైన ముద్ర వేశారు. 1992-2000 వరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక, దేశీయ క్రికెట్‌లో అత్యంత కీలకమైన రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన కే.ఎస్.రంజిత్‌సింహ్‌జీ కే.ఎస్. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టడం విశేషం.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్ 1996 టోర్నీలో బెంగుళూరు వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అజయ్ జడేజా కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో అజయ్ జడేజా కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ వర్తమాన క్రికెటర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. వకార్ యూనిస్, అకీబ్ జావెద్ వంటి అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించడమే ఆ మ్యాచ్ ప్రత్యేకత.
ఇక, టీమిండియాకు ఆడుతున్న రోజుల్లో అజయ్ జడేజా డేరింగ్ అండ్ డాషింగ్ అనే పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్ వచ్చేచోట రెండో పరుగు తీయడం లాంటివి చేసేవాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ జడేజా మెరుపులు మెరిపించాడు. గాల్లోకి అమాంతం ఎగరడం, ఒంటి చేతి క్యాచ్‌లు, సింగిల్ స్టంప్ వ్యూ రనౌట్‌లు లాంటివి ఎన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి.