దేశ ఆర్థిక రాజధాని ముంబయి వెళ్లే లైట్ మోటార్ వాహనాలకు (LMV) మహారాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ముంబయిలోకి ప్రవేశించే మొత్తం ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేయకూడదని అక్కడి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.నేటి అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో ములుంద్, తిన్హంత్, దహిసల్, వాషి, ఐరోలిలోని టోల్ బూత్‌ల వద్ద ఎస్‌యూవీలు, కార్లు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండానే నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఈ టోల్ ప్లాజాలలో రూ. 45 రుసుము వసూలు చేస్తున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ టోల్ ఫీజు మినహాయింపు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంతకుముందు చాలాసార్లు టోల్ రుసుము వసూళ్లపై ఆందోళనలు జరిగాయి. అప్పుడు మహా సర్కార్ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి నో టోల్ ఫీజు అనడంతో ఇదంతా ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి.