ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే... మరోవైపు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పై ఈరోజు ఆయన సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టాటా ఇన్నొవేషన్ హబ్ గురించి ప్రకటించారు. ఇన్నొవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్స్ గురించి ఈ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రతిదాన్ని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ మెంటార్ చేస్తాయని... డెవలప్ అవుతున్న సెక్టార్లలో టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్ కు కృషి చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు జోనల్ సెంటర్లతో ఈ హబ్ అనుసంధానమై ఉంటుందని తెలిపారు.