అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం అందుబాటులోకి వస్తుంది.. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం దొరుకుతుందనే ఆశలతో ఉన్న మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో కూడా జారీ అయ్యింది. డ్రగ్స్ రీహాబిలిటేషన్ కింద మద్యం ల్యాండెడ్ రేట్లపై 2 శాతం అదనంగా సెస్ విధించనున్నారు. ఈ సెస్ ద్వారా రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. ఇలా వచ్చిన నిధులను డ్రగ్స్ నియంత్రణ, రీహాబిలిటేషన్ కేంద్రాల కోసం ప్రభుత్వం వినియోగించనుంది. ఇక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
.అదనపు ప్రివిలేజ్ ఫీజు అంటూ మద్యం ధరలను చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంటే మద్యం బాటిల్ ధర రూ.150.50 పైసలు ఉంటే రూ.160 వసూలు చేస్తారు. అలాగే బాటిల్ ధర రూ.200.050 పైసలు ఉంటే రూ.210 వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే రౌండప్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మద్యం రేట్లు పెరగనున్నాయి. ఇక ఇప్పుడు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ అంటే మందుబాబు జేబుకు మరింత భారం పడక తప్పదు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
గత వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి.. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ మేరకు మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించగా.. భారీగా అప్లై చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలు ఉంటే 89882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము ద్వారానే ఏపీ ప్రభుత్వానికి రూ.1797.64 కోట్లు ఆదాయం వచ్చింది. దీనితోపాటుగా లైసెన్స్ ఫీజు ఇతరత్రా ఆదాయం కూడా ఉంటుంది. దీనికి జతగా ఇప్పుడు రెండు శాతం సెస్సు విధించనుండటంతో మరో రూ. వందకోట్లు ఆదాయం రానుంది.
నూతన మద్యం విధానం ప్రకారం రూ.99 లకే క్వార్టర్ బాటిల్ మద్యం అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అన్ని రకాల నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెప్పింది. రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుండటంతో ఏయే బ్రాండ్లు ఉంటాయో చూడాలి మరి.