సత్యసాయి జిల్లాలో దసరా పండుగ రోజున అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి వేళ.. కత్తులతో బెదిరించి ఇంట్లోని అత్తాకోడలిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. అధికారులు కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మరోవైపు ఈ కేసుపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పలు కీలక వివరాలు వెల్లడించారు.
అత్తాకోడలిపై అత్యాచారం కేసులో 48 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వంగలపూడి అనిత చెప్పారు. నిందితులు సీసీటీవీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారన్న వంగలపూడి అనిత.. సాంకేతికత సాయంతో 48 గంటల్లోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఇక నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు 200 కిలోమీటర్లు వారిని ఛేజ్ చేశారని.. కొండలూ, గుట్టలూ కూడా గాలించారని వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. ఐదుగురు నిందితులలో ముగ్గురు మైనర్లు ఉన్నారని వంగలపూడి అనిత చెప్పారు. అలాగే ఓ నిందితుడిపై ఏకంగా 32 కేసులు ఉన్నాయన్న హోంమంత్రి.. ఎక్కువగా దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో నిందితులకు వేగంగా శిక్షపడాలనే ఉద్దేశంతో ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా బాపట్ల సామూహిక హత్యాచారం కేసును, సత్యసాయి జిల్లా అత్తాకోడళ్ల అత్యాచారం కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించనున్నట్లు ఏపీ హోం మంత్రి తెలిపారు.
మరోవైపు మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెంచే ప్రయత్నాలు చేస్తు్న్నామన్నారు. ఇక ఇందులో ప్రజలు కూడా సహకరించాలన్న హోం మంత్రి.. ఇళ్లు, దుకాణాలపై ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీసుశాఖకు అనుసంధానం చేసేందుకు సహకరించాలన్నారు. నేరాల గురించి సమాచారం తెలిస్తే.. పోలీసులకు అందించాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. గత వైసీపీ పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేశారన్న వంగలపూడి అనిత.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలను ఉపేక్షించేది లేదన్నారు. నిందితులను త్వరగా పట్టుకోవటంతో పాటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి వేగంగా శిక్షించేలా చూస్తామన్నారు.