నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును జాగ్రత్తగా తిరిగి అప్పగించారు. ఆదివారం రోజు అల్లూరులో శ్రీహరికోట కుమారి ఆర్టీసీ బస్సు ఎక్కారు.. అయితే తన స్టాప్‌లో బస్సు దిగిపోయే సమయంలో ఆమె తన పర్సును సీట్‌లో మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆర్టీసీ బస్ కండక్టర్ వెంకయ్య పర్సును గమనించారు.. తీసి చూడగానే బంగారం, డబ్బులు కనిపించాయి. వెంటనే ఈ సమాచారాన్ని డిపో మేనేజర్‌కు అందించారు.
ఆ మహిళ పర్సును తీసుకెళ్లి జాగ్రత్తగా డిపోలో అప్పగించారు. ఆర్టీసీ డిపో అధికారులు సదరు మహిళ వివరాలు సేకరించి సమాచారం పంపారు. సోమవారం ప్రయాణికురాలు డిపోకు రాగా.. మేనేజర్ చేతుల మీదుగా పర్సును తిరిగి ఆమెకు అప్పగించారు. ప్రయాణికురాలు పర్సులో ఉన్న ఆభరణాల వివరాలు సరిగ్గా ఉన్నాయని చెప్పారు. బస్సులో దొరికిన పర్సును జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగించి నిజాయితీ చాటుకున్న కండెక్టర్ వెంకయ్యను ఆర్టీసీ అధికారులు, స్థానికులు అభినందించారు. అలాగే ప్రయాణికురాలు కూడా కండక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆమె పోగొట్టుకున్న పర్సులో రూ.లక్ష విలువచేసే బంగారం, రూ.4వేలు డబ్బులు ఉన్నాయి.
జిల్లాలో రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. వలేటివారిపాలెం మండలం పోకూరుకు చెందిన స్థానికులు నలదలపూరు ఎస్సీకాలనీలో ఆదివారం రాత్రి జరిగిన లింగాబత్తిన సులోచన మనవరాలు వివాహ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ వధూవరులను వారు ఆశ్వీరదించి.. వేకువజామున 3 గంటల తర్వాత కారులో పోకూరుకు బయలుదేరారు. సొంత ఊరి దగ్గరకు రాగానే మలుపు దగ్గర కారు అదుపు తప్పి పొలం గట్టును డీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెనుక సీటులో ఉన్న లింగాబత్తిన సులోచన, కాలె సామ్రాజ్యం ముందు సీటుకు బలంగా ఢీకొని చనిపోయారు. డ్రైవరు సుకుమార్ కాలుకు తీవ్ర గాయం కాగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.