ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. విజయవాడ నుంచి కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. గన్నవరం (విజయవాడ) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల 27 నుంచి సర్వీసును ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గతంలోనే ప్రకటించగా.. ఇండిగో సంస్థ కూడా ఆ రోజు నుంచే విశాఖపట్నంకు తమ విమాన సర్వీస్‌ను ప్రారంభించబోతోంది.
విజయవడ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరుగ ప్రయాణంలో విమానం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విషయానికి వస్తే.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల రాకతో విజయవాడ-విశాఖ విమాన సర్వీస్‌ల సంఖ్య మూడుకు చేరబోతోంది. అలాగే హైదరాబాద్, అహ్మదాబాద్‌లకు కొత్త విమాన సర్వీసులు అక్టోబర్ 29 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడుచోట్ల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు, స్థలాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ ప్రతిపాదిత ప్రాంతాల్లో స్థలం అందుబాటులో ఉంటే త్వరలోనే ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పనులు వేగవంతం చేశారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. అమరావతికి ప్రముఖుల రాకపోకలు పెరగడంతో.. వీలైనంత త్వరలో నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మేరకు 2025 జనవరి నాటికి కాంక్రీటు పనులు.. జూన్ నాటికి గ్లాస్, ఇతర పనులు పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకున్నారు.