వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ మంగళవారం విజయవాడలో మరోసారి మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో.. వ్యక్తిగత అవసరాల కోసం కోట్లాది రూపాయిలు మింగిన అనకొండ ఈ జగన్ రెడ్డి అని విమర్శించారు. జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు అయిన ఖర్చు సాధారణ పరిపాలన శాఖ లెక్కల ప్రకారం రూ.12.85 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. సీఎంగా జగన్ ఉన్న సమయంలో ఏ విధంగా వందల, వేల కోట్ల రూపాయాలు ప్రజా ధనాన్ని ఖర్చు చేశాడో.. వాటికి నిదర్శనం నేడు ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయన్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌తోపాటు రూషికొండ ప్యాలస్‌లోని బాత్ టబ్‌ల నుంచి మసాజ్ టేబుళ్ల వరకు అన్ని ప్రజల సొమ్ముతోనే చేయించుకున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం మింగటం, సొంత ఖజానాకు చేర్చుకోవటం, మిగిలింది తన విలాసల కోసం ఖర్చు చేయడం.. ఇది జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన దినచర్య అని ఆయన అభివర్ణించారు. అలా విలాసాలకు ఖర్చు చేసిన అనేక అంశాల జాబితాలో తాడేపల్లి ప్యాలస్ చుట్టూ దాదాపు 25 నుంచి 30 అడుగుల ఎత్తున భారీ ఇనుప కంచె నిర్మించుకున్నాడని ఆయన వివరించారు. ప్రపంచంలోని ఉన్న ఏడు వింతలు ఒక ఎత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మరో వింతగా తాడేపల్లి ప్యాలెస్‌కు వేసుకున్న ఇనుప కంచె అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రపంచంలో ఎవరు కూడా తమ ఇంటికి కంచె కట్టుకుని ఉండరని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఆయన.. తన సొంత నిధులతో నిర్మించుకున్నది కాదని.. అక్షరాలా రూ.12.85 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించుకున్నారన్నారు. నీ తాడేపల్లి ప్యాలెస్‌లోని ఫర్నిచర్ కోసం లేఖ రాస్తే చెక్కు రాసి ఇస్తానన్నావ్ కదా..? ఏది ఈ రూ.5000 కోట్లకు చెక్కు రాసి ఇవ్వు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పట్టాభిరామ్ సవాల్ విసిరారు. ఆ చెక్కు తీసుకునేందుకు నేనే వస్తానని అన్నారు. గతంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను ఎంతలా వేధించావో మర్చిపోయావా..? అని ఈ సందర్భంగా జగన్ ని సూటిగా పట్టాభిరామ్ ప్రశ్నించారు.