కర్నూల్ జిల్లాలో రాజకీయం హఠాత్తుగా హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమె మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరగడంతో కర్నూల్ రాజకీయాలు వేడెక్కాయి. అసలేమైందంటే.. టీడీపీ నేత భూమా అఖిలప్రియ నంద్యాలలో ఉన్న విజయ పాల డైరీ పరిశ్రమను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే డైరీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ఫొటోలను తొలగించి, సీఎం చంద్రబాబు ఫొటోలను ఉంచారు. జగన్ ఫొటోలు పెట్టిన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలువలో పడేసిన వారిని వదిలిపెట్టేది లేదని అఖిల ప్రియ హెచ్చరించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చిన విషయం తెలుసుకొని విజయ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఫోన్ చేశారు. తన సీట్లో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను జగన్ ప్రశ్నించారు. సిబ్బంది కూర్చోమంటే కూర్చుకున్నానని అఖిల సమాధానం ఇచ్చారు. జగన్ అంతటితో ఆగకుండా.. తనను అడగకుండా కూర్చోడానికి నువ్వెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా' అని అఖిల ప్రశ్నించారు. "బెదిరిస్తున్నావా... నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం" అని అఖిల ప్రియ సవాల్ విసిరారు. ఫోన్ సంభాషణ ఒక్కసారిగా రాజకీయ మాటల మంటలు పుట్టించింది.