ముంబై నటి జెత్వానీ కేసులో పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కేసును తాజాగా సీఐడీకి అప్పగించారని , కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు. కేసు డిస్పోజ్ అయ్యే వరకు పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యే విధంగా చూడాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులు అభ్యర్థించారు. ఈ అంశాలను నోట్ చేసుకున్న న్యాయస్థానం.. కేసు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
కాగా.. నటి జెత్వానీ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ఇటీవల డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా... సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రథమ నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నిందితులుగా ఉన్న అప్పటి విజయవాడ సీపీ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, దర్యాప్తు అధికారి సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.