ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలోని 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించగా.. రికార్డుస్థాయిలో 89,882 అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఒక్కో షాపునకు సగటున 25 మంది దరఖాస్తు చేశారని మంత్రి కొల్లు వెల్లడించారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. సోమవారం లాటరీ నిర్వహించి మద్యం షాపులు కేటాయింటినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి నూతన మద్యం పాలసీ ద్వారా విక్రయాలు జరగనున్నట్లు వెల్లడించారు. "దరఖాస్తుల స్వీకరణ, మద్యం షాపుల కేటాయింపు సజావుగా జరిగింది. ఇకపై ఏపీలో మద్యం విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కొత్త బ్రాండ్స్‌ను టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది. వైసీపీ హయాంలో ఇసుక, మద్యం విచ్చలవిడిగా అమ్మి జగన్ సొమ్ము చేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వకాలు చేయడం వల్ల అనేక కేసులు నమోదు అయ్యాయి. అసలు జగన్ సర్కార్‌లో ఎంత ఇసుక తీశారో, ఎంత మేర విక్రయాలు జరిగాయో లెక్కలే లేవు. వైసీపీ చేసిన ఇలాంటి పనుల వల్ల ప్రజలపై భారం పడింది. తాజాగా ఏపీలో108 ఇసుక రీచ్‌లు గుర్తించాం. ఈనెల 16న 40 రీచ్‌లను ఓపెన్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రెండు నెలల్లోపే ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుంది’’ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.