అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో గురువారం ఉదయం సమీక్ష నిర్వహించారు.ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లాల అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు సూచించారు.కాగా నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కొండాపురం మండలం, సత్యవోలు అగ్రారం మిడత వాగులో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తు్న్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో మంత్రి చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.తుపాను ప్రభావం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. కలెక్టరేలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. ఆనం ఆదేశాలతో ముఖ్యంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఆర్డీవో పావని, అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చిత్తూరు జిల్లాలో మూడురోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజల కోసం ముందస్తుగా అధికారులు 208 పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేశారు. వాకాడు, చిల్లకూరు, కోట, తడ, గూడూరు, బీఎన్‌కండ్రిగ, డక్కిలి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇక సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, వాకాడు, కోట, తడ, సూళ్లూరుపేటలో భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధమైంది. వాకాడు మండలం తూపిలిపాళెం ఎస్టీకాలనీ వాసులను ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు. మిగతా మండలాల్లోని ప్రజలను రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను గూడూరు ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూముకు (ఫోను నెంబరు: 0877-2236007) లేదా ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోని కంట్రోల్‌రూమ్‌లకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.