ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్‌కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.
ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సాగించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది.