నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండమని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో మనం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు. అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.... ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది. పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంది. ప్రతిపక్షంగా, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగా పార్టీ కొనసాగుతోంది. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగింది. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటాం. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటాం. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వరకూ కమిటీలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశమయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి.
అనుబంధ విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. కమిటీలు ఏర్పాటు అన్నది కాగితాలకే పరిమితం కాకూడదు. దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటపై పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా మనం ఎదుగుతాం. గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మనం ఇచ్చిన పిలుపునకు ఉద్ధృతమైన స్పందన వస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అంశాలపై స్పందించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై మాట్లాడాలి. బాధితులకు అండగా నిలవాలి అని తెలియజేసారు.