ఘోరపరాజయంతో డీలాపడ్డ పార్టీశ్రేణులను యాక్టివ్ చేసేందుకు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వై.యస్ జగన్. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులను, పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమించిన జగన్మోహన్‌రెడ్డి..నియోజకవర్గాలకు కూడా సమన్వయకర్తల నియామకాన్ని మొదలుపెట్టారు. ఎలా పని చేయాలి, ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలనేదానిపై తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో జరిగిన వర్క్ షాప్‌లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.ఈ వర్క్‌షాప్‌కి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటుతో పాటు కీలక అంశాలపై నేతలతో జగన్ చర్చించారు. పార్టీపరంగా చేపట్టబోయే కార్యక్రమాలను నేతలతో షేర్ చేసుకున్నారు. ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదని.. ప్రజాసమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. నాలుగు నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని.. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ముఖ్యంగా సోషల్ మీడియాను బలంగా మార్చుకోవాలని.. నాయకులకు పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉంటాయని జగన్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపైన పార్టీ శ్రేణులతో మాట్లాడిన జగన్ జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ ఉండాలని తాజాగా నేతలకు పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల చేతిలో దాడికి గురైన వైసీపీ నాయకులు, కార్యకర్తలను త్వరలో ఇళ్లకు వెళ్లి పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. దీంతో పాటు ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు పార్టీశ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మొత్తానికి అధినేత వరుస మీటింగ్‌లతో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతోందన్న ఉత్సాహంతో ఉన్నారు వైసీపీ నేతలు.