తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ విజయాలు, టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, సూపర్ సిక్స్, పల్లె పండుగ, సహా 8 అంశాలపై చర్చించారు. ప్రత్యేకంగా, లోక్ సభ స్థానాల పరిధిలోని సమస్యలను ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... గత ఐదేళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని వ్యాఖ్యానించారు. ఏ వ్యవస్థ కూడా సజావుగా పనిచేస్తోంది అనుకోవడానికి లేకుండా విధ్వంసం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా దారిమళ్లించారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులను చూడలేదని అన్నారు. రాష్ట్రంలో ఏ అరాచకం చూసినా, దాని వెనుక ఏదో ఒక గంజాయి బ్యాచ్ ఉంటోందని, తప్పు చేసిన వాళ్లను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడించారు.రాష్ట్రంలో ఇసుక, మద్యంపై కొత్త పాలసీలు తీసుకువచ్చామని చెప్పారు. అయితే ఇసుక, లిక్కర్ అంశాల్లోనే కాకుండా... ఇతర వ్యాపారాల్లోనూ ఎవరూ జోక్యం చేసుకోవద్దని టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్పష్టం చేశారు. మాగుంట కుటుంబం ఎప్పటినుంచో లిక్కర్ వ్యాపారంలో ఉందని, ఆ విధంగా కుటుంబ వారసత్వంగా వచ్చే వ్యాపారాలు చేసుకుంటే ఫర్వాలేదని, కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి ధనార్జన చేయాలని ప్రయత్నించవద్దని హెచ్చరించారు. నేతలకు విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పడుతుందని, ఆ విశ్వసనీయత పోవడానికి నిమిషం చాలని... ఇది తనకు కూడా వర్తిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.దేశ రాజకీయాల్లో ఎప్పటినుంచో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న టీడీపీ శక్తిమంతమైన పార్టీగా ఆవిర్భవించిందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, దేశం కోసం, ప్రజల కోసం పాటుపడడమే టీడీపీకి పరమావధి అని వివరించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ సమర్థవంతమైన పాత్ర పోషించిందని చంద్రబాబు తెలిపారు. నాడు ఎలాంటి పదవులు తీసుకోకుండానే వాజ్ పేయి ప్రభుత్వంలో కొనసాగామని గుర్తు చేశారు. పార్టీ కూడా ఓ కుటుంబం వంటిదేనని, చిన్న చిన్న సమస్యలు ఉండడం సహజమేనని అన్నారు. "పార్టీలో ఉన్న వారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో కార్యకర్త తప్పు చేసినా సీఎంపై ఆ ప్రభావం పడుతుంది. పార్టీ కూడా నష్టపోతుంది. మిమ్మల్ని ఎవరూ గమనించడంలేదు అనుకోవద్దు. ఇటీవల ఎన్నికల్లో అవతలి వారు బస్తాల కొద్దీ డబ్బులు వెదజల్లారు. కేవలం డబ్బుతోనే ఎన్నికలు జరుగుతాయనుకోవద్దు. మనపై నమ్మకంతోనే ప్రజలు ఓటేశారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టే క్రమంగా నిలదొక్కుకుంటున్నాం. కూటమిలో ఉన్నాం కాబట్టి మిగతా భాగస్వామ్య పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి" అంటూ చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa