సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ 12 వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు హాజరయ్యారు. సాక్షి దినపత్రికలో ‘‘చినబాబు చిరుతిండికి 25 లక్షలండి’’ కథనంపై మంత్రి కోర్టును ఆశ్రయించారు. ఉద్దేష పూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారని రూ.75 కోట్ల రూపాయలకు లోకేష్ పరువు నష్టం దావా కేసు వేశారు. ఆగస్ట్ 29 న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరవగా.. తిరిగి ఈరోజు (శుక్రవారం) లోకేష్‌ను మరోసారి విశాఖ కోర్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ కేసు విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. కాగా.. ‘‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిపత్రికలో అసత్యాలు, కల్పితాలతో ఓ స్టోరీ ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి న్యాయపోరాటానికి దిగారు.
సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు.