రాష్ట్రంలో మరోసారి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఆర్కేబీచ్, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈరోజు (శుక్రవారం) కూడా కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది.
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు. ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. మార్కాపురం మండలం బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తర్లుపాడు - మార్కాపురం మధ్య కొండ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.